రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇలా నోరు విప్పారో లేదో అలా ప్రత్యర్థి టెలికం కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పతనమైన మొత్తం షేర్ల విలువ దాదాపు రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంచలన ఆఫర్‌తో ముందుకు వచ్చిన రిలయన్స్ జియో.. వచ్చీ రావడంతోనే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది. జియో దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగివచ్చాయి. పోటీని తట్టుకునేందుకు టారిఫ్‌లను విపరీతంగా తగ్గించాయి. ఇక జియో వెల్‌కమ్ ఆఫర్ ఈనెల 30కి ముగుస్తుండడంతో తాజాగా ఈరోజు ఆఫర్‌ను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈరోజు ముంబైలో ముకేశ్ అంబానీ ‘హ్యాపీ న్యూ ఇయర్’గా నామకరణం చేసిన సరికొత్త ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
జియో ఆఫర్‌ను పొడిగిస్తూ అంబానీ ప్రకటన చేసిన 25 నిమిషాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రత్యర్థి టెలికం కంపెనీలకు చెందిన షేర్లు పతనమయ్యాయి. ముకేశ్ ప్రకటన ఇతర టెలికం కంపెనీలకు శరాఘాతంగా మారింది. మధ్యాహ్నం 1:30 గంటలకు రూ.324 వద్ద ట్రేడ్ అయిన ఎయిర్‌టెల్ షేర్ ముకేశ్ ప్రారంభం ముగిసే సరికి రూ.318కి పడిపోయింది. ఈ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.2,276 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐడియా షేర్లు కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. రూ.76.60 వద్ద ట్రేడవుతున్న ఆ షేర్లు 2:30 గంటలకు రూ.74.20కి పడిపోయింది. ఈ మొత్తం మార్కెట్ విలువ రూ.864 కోట్లు. కాగా జియో ఆఫర్ పొడిగింపు సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడిన ముకేశ్ జియోకు మూడు నెలల్లోనే 5కోట్ల చందాదారులు ఏర్పడినట్టు తెలిపారు. త్వరలోనే నగదు రహిత లావాదేవీలను సైతం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
No comments:
Post a Comment